
అద్వితీయ ఉపాధ్యాయుల కార్ఖానా అవనిగడ్డ
అవనిగడ్డ:అద్వితీయ ఉపాధ్యాయులను తయారుచేసే కార్ఖానాగా అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందని తెలిపారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1208 మంది ఉద్యోగాలు సాధిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలోనే 275 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించటం గర్వకారణం అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడతూ డీఎస్సీ ఉపాధ్యాయులకు దీపావళి ముందే వచ్చిందన్నారు. ఎన్నొ నిద్రలేని రాత్రులు గడిపి ఏళ్ళ తరబడి శ్రమించి టీచర్ పోస్టులు సాధించిన వారు అదృష్టవంతులు అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, ప్రగతి డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పూర్ణచంద్రరావు, విద్యానికేతన్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంఈఓలు, జీఎన్‌బీ గోపాల్, టీవీఎం రామదాసు, శివశంకర్, నాంచారయ్య, శ్రీకాంత్, అన్నపరెడ్డి పిచ్చయ్య, పి.వెంకటేశ్వరరావు, ఏవీ రమణ, మోమిన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, డీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ పెరుమాళ్ళు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, పీఆర్‌టీయూ జిల్లా నాయకులు వి.వి.ఎస్.ఆర్.వర్మ తదితరులు పాల్గొన్నారు.