ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో | - | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో

Oct 11 2025 6:38 AM | Updated on Oct 11 2025 6:38 AM

ఎన్టీ

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో

సాక్షిలో వెలువడిన కథనానికి స్పందించిన వైనం తాగునీటి కాలుష్యంతో అధికారులపై ఆగ్రహం పైపుల లీకేజీతోనే బూడిద నీటి కాలుష్యమన్న ఆర్డీఓ నూతన పైప్‌లైన్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తాం ఆర్డీఓ కావూరి చైతన్య

ఇబ్రహీంపట్నం:ఎన్టీటీపీఎస్‌ బూడిద నీటి కాలుష్యంపై అధికారుల్లో చలనం వచ్చింది. ‘జలం.. గరళం’ శీర్శికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడింది. ఈనేపథ్యంలో ఆర్డీఓ కావూరి చైతన్య ఇతర అధికార యంత్రాంగం కదిలింది. ఎన్టీటీపీఎస్‌ నుంచి విడుదల అవుతున్న బూడిద నీరు బుడమేరు, చన్నీటి కాలువ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్లాంటులో కలిసే ప్రాంతాలను ఎన్టీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ శివ రామాంజనేయులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ముందుగా ఆరడబ్ల్యూఎస్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు సమీపంలో చన్నీటి కాలువ నుంచి నీటిశుద్ధి ప్లాంటుకు నీరువచ్చే ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో మారిన నీటి రంగును గుర్తించారు. అనంతరం ఏకాలనీ వద్ద ఎన్టీటీపీఎస్‌ ప్లాంటు నుంచి బూడిద చెరువుకు నీటిని చేరవేసే పైపులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిత్యం బూడిద మాఫియా నేతలు పైపులు పగలగొట్టి లీకేజీలు సృష్టిస్తారని, కారిన బూడిద లారీలకు అక్రమ లోడింగ్‌ చేస్తారని వైఎస్సార్‌ సీపీ నాయకులు గుంజా శ్రీనివాస్‌, మేడపాటి నాగిరెడ్డి ఆర్డీఓకు వివరించారు. ప్లాంటులో మిగులు వ్యర్థాలు కాలువ ద్వారా సెక్యూరిటీ కాలనీ సమీపంలో బుడమేరు కాలువలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో నీరంతా బూడిద మయంగా మారడాన్ని గుర్తించారు. ఎన్టీటీపీఎస్‌ ప్లాంటులోని సైలో ప్రాంతంలో పొడి బూడిద లారీలకు లోడింగ్‌ చేసే విధానం, అక్కడ కలుషిత నీరు లీకేజీ పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచే ఎక్కువ బూడిద నీరు తాగునీటితో కలిసే అవకాశం ఉందని గుర్తించారు.

ఎన్టీటీపీఎస్‌ అధికారులపై ఆగ్రహం...

సంస్థలో బూడిద నీటి నిర్వహణ తీరును ప్రశ్నించారు. తాగునీటిలో బూడిద నీరు కలవడంతో ఎన్టీటీపీఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్‌లైన్‌ల లీకేజీలతోనే బూడిద తాగునీటిలో కలుస్తుందని అధికారులు సర్థిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు ధీటుగా సమాధానం చెప్పాలని చూసిన టీడీపీ నాయకులపై మండిపడ్డారు. బూడిద నీటి కాలుష్యంపై ఆర్డీఓ చైతన్య స్పందిస్తూ బూడిద నీటిని తరలించే పైపులు లీకేజీ వలన తాగునీరు కలుషితం అవుతుందన్నారు. ఎక్కువగా వర్షం వచ్చిన సమయాల్లో నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు. వాటర్‌ పైప్‌లైన్‌లు, లీకేజీలు, చన్నీరు, వేడినీటి కాలువల్లో బూడిద నీరు కలిసే ప్రాంతాలు పరిశీలించామన్నారు. మైలవరం నియోజకవర్గం గ్రామాలకు తాగునీటి సరఫరాకు ఇక్కడి నుంచే కావడం వలన సమస్య ఏర్పడిందన్నారు. దీని నివారణలో భాగంగా సుమారు 9 కిలో మీటర్ల పొడవైన పైప్‌లైన్‌ రీప్లేస్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు ఫిల్టర్‌ పాయింట్‌కు వెళ్లే పైప్‌లైన్‌ కూడా 15 మీటర్లు దూరం ముందుకు తీసుకువెళ్లే బూడిద నీటితో సంబంధం ఉందని గుర్తించారన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి సెంట్రలైజ్‌ పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. వాటర్‌ పంపింగ్‌ సిస్టమ్‌కు రూ.1.50 కోట్లు అవసరమవుతుందన్నారు. ఎన్టీటీపీఎస్‌ బూడిద నీటి కాలుష్యం వ్యవహారం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ నేతృత్వంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సీహెచ్‌ చిట్టిబాబు, తహసీల్దార్‌ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రమ్యకీర్తన, వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ ప్లోర్‌ లీడర్‌ గుంజా శ్రీనివాస్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాస్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో1
1/2

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో2
2/2

ఎన్టీటీపీఎస్‌ నీటి కాలుష్యం పరిశీలించిన ఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement