
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది!
కృష్ణా జిల్లాలో ఇలా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి నిధులు విడుదల చేయకుండా సేవలు అందించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఆ పథకంలో వైద్య చికిత్సలను నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి తమకు బకాయిగా ఉన్న రూ.2,700 కోట్లను విడుదల చేస్తేనే ఆస్పత్రుల మనుగడ సాధ్యమవుతుందంటూ తేల్చి చెప్పాయి. విజయవాడలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ఎదుట యాజమాన్యాలు బోర్డులు సైతం ఏర్పాటు చేశాయి. కొత్త కేసుల రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిపివేసి.. కేవలం ఫాలోఅప్ కేసులకు మాత్రమే వైద్య సేవలు అందించాయి.
బోర్డులు ఏర్పాటు..
ఆరోగ్యశ్రీలో తాము ఎందుకు సేవలు నిలిపివేశామో తెలియజేస్తూ ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.2,700 కోట్లు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతినెలా బిల్లు రూ.380కోట్ల నుంచి రూ.420 కోట్లు అవుతోందని, వాటిని ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు చెల్లించాలని, సర్జరీ ప్యాకేజీల్లో పెరుగుదల లేకపోవడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని కోరుతూ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ బకాయిలు విడుదల చేసే వరకూ సేవలు కొనసాగించలేమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.
జిల్లాలో 60 నెట్‌వర్క్ ఆస్పత్రులు..
ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు 60 ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు రూ.300 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయి ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ఆస్పత్రుల నిర్వహణ ఇప్పటికే కష్టంగా మారి, ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం బకాయి చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో బతుకు భారంగా మారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు, బయోమెడికల్, ఇతర పన్నులు సైతం చెల్లించలేని దుస్థితికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు చేరుకున్నట్లు వారు చెబుతున్నారు.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులలో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్యసేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవల కోఆర్డినేటర్ ఎస్.బి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో మొత్తం 28 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్యసేవ కింద పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 9 ప్రభుత్వ, 19 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు. మచిలీపట్నంలోని ఆంధ్రా ఆస్పతి, గుడివాడలోని అన్నపూర్ణ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మినహాయించి, మిగతా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు సతీష్ కుమార్ తెలిపారు.
జిల్లాలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు
నిధులివ్వకుండా సేవలు
అందించలేమంటున్న ఆస్పత్రులు
బోర్డులు ఏర్పాటు చేసి మరీ
రోగులకు చెబుతున్న వైనం