
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమేనా సుపరిపాలన అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసే కుటిల రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.
ఉద్యమంలా చేపడదాం..
అనంతరం అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే తమ పార్టీ నాయకుల వృద్ధి అని కొత్త నిర్వచనానికి చంద్రబాబు నాంది పలికారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైఎస్సార్ సీపీ నేతలు చూస్తూ ఊరుకోరన్నారు.
విద్య, వైద్యం రెండు కళ్లుగా..
రాష్ట్రంలో గత ఐదేళ్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన విద్య, వైద్యం రెండు కళ్లుగా సాగిందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు 50 సీట్లకు అనుమతి వస్తే, వద్దన్న నీచ చరిత్ర చంద్రబాబుది అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు దండుకోవాలనే చంద్రబాబు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొత్తం పది కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి అయ్యేవన్నారు. కోటి సంతకాలను సేకరించి గవర్నర్‌కు అందజేస్తామని, కూటమి నాయకులు చేసే కుటిల రాజకీయాలకు ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.
కూటమి కుటిల రాజకీయాలు
ప్రజల్లోకి తీసుకెళ్దాం
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ
అధ్యక్షుడు దేవినేని అవినాష్,
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా సంతకాల సేకరణ