
రూ.8.15 కోట్లకు దుర్గమ్మ చీరల టెండర్
● బహిరంగ వేలంలో దక్కించుకున్న పావనీ కలెక్షన్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించే చీరల సేకరణ కాంట్రాక్టు రికార్డు ధర పలికింది. ఏడాదికి రూ.8.15కోట్లు చెల్లించేందుకు విజయవాడకు చెందిన పావనీ కలెక్షన్స్ ముందుకొచ్చింది. ఇంద్రకీలాద్రిపై మహామండపం ఆరో అంతస్తులో శుక్రవారం చీరలకు బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్లను దేవస్థానం ఆహ్వానించింది. రూ.50 లక్షల ప్రథమ ధరావత్తును చెల్లించిన ఏబీఐ ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్, ఆదిత్య ఎంటర్‌ప్రైజర్, పావనీ కలెక్షన్స్ పేరిట ముగ్గురు కాంట్రాక్టర్లు బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దేవస్థాన పాటను రూ.10 కోట్లుగా నిర్ణయించి వేలం ప్రక్రియను ప్రారంభించారు. అక్టోబర్ 20తో ముగిసే ఈ ఏడాది పాట రూ.5.50కోట్లు కాగా, భక్తులు సమర్పించే చీరలు, ముక్క చీరలు, ఆషాఢ సారె మొత్తం కాంట్రాక్టరే సేకరించుకునేలా దేవస్థానం షరతులలో మార్పులు చేసింది. అయినప్పటికీ దేవస్థానం నిర్ణయించిన ధర అధిక మొత్తంలో ఉందని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆలయ వేలాన్ని రూ.8.05 కోట్ల నుంచి ప్రారంభించారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, అమ్మవారికి మొక్కుబడులు చెల్లించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆలయ ఈవో శీనానాయక్ వివరించారు. చివరకు పావనీ కలెక్షన్స్ రూ.8.15 కోట్లకు బహిరంగ వేలంలో కాంట్రాక్టు దక్కించుకుంది. సీల్డ్ టెండర్, ఈ–టెండర్‌కు కాంట్రాక్టర్లు ఎవరూ దాఖలు చేయలేదని దేవస్థాన అధికారులు ప్రకటించారు. టెండర్ ప్రక్రియను ఏసీ రంగారావు, సుజన్, ఏఈవో సుధారాణి, సూపరింటెండెంట్ హేమదుర్గాంబ, రాజు పర్యవేక్షించారు.