
టపాసుల గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీలు
పెదపూడి(మొవ్వ): దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో మొవ్వ మండలం పెదపూడిలోని బాణ సంచా షాపులు, గోడౌన్‌లపై బందరు స్పెషల్ బ్రాంచ్ బృందం స్థానిక పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని పెడసనగల్లు రోడ్డులోని ఓ షాపులో అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు లేకుండా నిల్వ ఉంచిన టపాసుల ఉంచినట్లు గుర్తించారు. ఆ టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కూచిపూడి ఎస్‌ఐ కెఎస్ విశ్వనాథ్ తెలిపారు. కాగా నిల్వ ఉన్న టపాసుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై గ్రామ వీఆర్‌వో రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ వెల్లడించారు.
ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్
చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం తెల్లవారుజామున మండలంలోని అన్నవరం చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ లారీని తనిఖీ చేసి ఇసుక ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా రాజమండ్రిలో బియ్యం దిగుమతి చేసి, అక్కడి నుంచి ఇసుక తీసుకువస్తున్న రెండు లారీలను మండలంలోని గండ్రాయి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు లారీల డ్రైవర్‌లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వల్కి వెంకన్నం, వర్థం సురేష్, వంగర శ్రీశైలంను అదుపులోకి తీసుకుని వోల్టా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మండలంలోని మల్కాపురం మునేటి నుంచి రెండు ఇసుక ట్రాక్టర్‌లు తెలంగాణకు ఇసుక తరలిస్తుండగా చెక్‌పోస్టు సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమో దు చేసి, లారీలు సీజ్ చేశామని తెలిపారు.

టపాసుల గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీలు