
ముఖ ఆధారిత హాజరుతో పారదర్శకత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను మరింత పెంచేందుకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందుకు గాను ఆధార్ డేటా, ఈ–కేవైసీతో ఫేస్ అథంటికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఎంపీడీవోలు, డ్వామా అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు పథకం అమల్లో పురోగతిపై దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికపై దృష్టి..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఉపాధి శ్రామికుల ముఖ గుర్తింపు హాజరు నమోదుకు సంబంధించిన ఫేస్ – ఆర్‌డీ అండ్ ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను ఫీల్డ్ అసిస్టెంట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను గ్రామసభల ద్వారా గుర్తించేందుకు అవసరమైన ప్రణాళికపై దృష్టిసారించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చూస్తే సగటు వేతనం విషయంలో గంపలగూడెం, కంచికచర్ల జగ్గయ్యపేట మండలాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయని.. ప్రతి మండలం ఈ విషయంలో ప్రగతి చూపేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 2025–26లో 4వేల ఎకరాల ఉద్యానపంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,745 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మునగ సాగుకు 880 ఎకరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వివరించాలన్నారు. డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.