
వేడుక ఏదైనా చందా చెల్లించాల్సిందే!
చందాల దందా..
శాశ్వతంగా కాజేసేందుకు కుట్ర..
ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘పశ్చిమ నియోజకవర్గంలో ఏమైనా సరే ఏ పార్టీ వారైనా, దేనికై నా సరే, ఏ సమావేశాలకై నా, ఏ ఫంక్షన్ కై నా, ఉత్సవాకైనా కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు. ఇది మన సిద్ధాంతం. మొదటి నుంచి చెబుతున్నాం, మీ వద్దకు ఎవరైనా ఆ విధంగా చందాల వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీసుకు తెలియజేయండి. ఎవరికీ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.’ ఇటీవల విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్‌లో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం సంద ర్భంగా విలేకరులతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పిన మాటలివి. దీనిని బట్టే చందాల దందా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.కోట్లు దండుకొనే ప్రణాళిక రచించినట్లు టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గొల్లపూడిలో మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి 39.99ఎకరాల మాన్యం ఉంది. ఆ మాన్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ఆ భూమిలో మట్టి తోలి చదును చేశారు. ఈ విషయం సీఎంఓ దృష్టికి వెళ్లటంతో, వెంటనే ఆ ప్రాంతంలో పనులు నిలిపి వేయాలని ఆదేశించినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉత్సవాల మాటున రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించిన పార్లమెంటు ముఖ్యనేతతోపాటు, మరికొందరు పట్టు వదలకుండా తమ పరువు పోతోందని, ఉత్సవాల నిర్వహణకు తాత్కాలికంగా లీజు ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే ఇప్పటికే ఈ భూమిని గొల్లపూడిలోని ఆరు మంది రైతులకు ఈ ఏడాది మే నెలలో బహిరంగా వేలం నిర్వహించి, జూన్‌లో ఏడాది పాటు లీజుకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వారి నుంచి సబ్ లీజు తీసుకొని అక్కడ ఉత్సవాలు నిర్వహించే వీల్లేదు. దీంతో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి రెండు రోజుల క్రితం గొల్లపూడిలో ఆ రైతులను పిలిపించి, మాట్లాడి, వారు కట్టిన లీజు మొత్తాని కంటే ఎక్కువగా ఇచ్చి, వారే స్వయంగా లీజు రద్దు చేసుకొంటామనేలా ఒప్పించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నారు. ఈ విధంగా ఎగ్జిబిషన్ సొసైటీ తాత్కాలిక లీజు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతోపాటు మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని, కొనకళ్ల నారాయణలు వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకున్నట్లు కలరింగ్ ఇచ్చారు. 56 రోజుల లీజుకోసం రూ.45లక్షల చెక్కును ఆ ఆలయ ఈవోకు అందించారు.
మొన్న వినాయక చవితికి భారీగా
వ్యాపారుల నుంచి వసూలు
ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ పేరుతో మరోసారి చందాల దందా
ఎవరికీ రూపాయి ఇవ్వొద్దంటూ
ఆదేశాలిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలం
అవుతున్న ఇతర కూటమి నేతలు
ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో
రూ. కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కొంత మంది నేతలు చందాలు వసూలు చేయడం పరిపాటిగా మారింది. పండుగలు వస్తే అక్కడ వ్యాపారులు హడలిపోతున్నారు. షాపుల వ్యాపారాన్ని బట్టి ‘పచ్చ’ట్యాక్స్ వేస్తున్నారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నా టీడీపీ నేత ‘ధూం ధాం’గా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వ్యాపారవర్గాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా వస్త్ర, ఎలక్ట్రికల్, బంగారు, గొల్లపూడి మార్కెట్, ప్రముఖ వ్యాపార సంస్థలు, హోటళ్లు ఇలా అన్ని వ్యాపార వర్గాల నుంచి టార్గెట్‌లు పెట్టి ముక్కు పిండి వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలు వస్తుండటం, విజయవాడ ఉత్సవ్ అని హడావుడి చేస్తూ, చందాల వసూళ్లకు ప్రణాళిక రచించిన విషయం వ్యాపారుల దృష్టికి రావడంతో హడలి పోయి, కొంత మంది వ్యాపారులు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బహిరంగంగానే పత్రికా సమావేశంలో నో చందా.. నో దందా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాత్కాలిక లీజు పేరుతో భూమిని స్వాధీనం చేసుకొని, శాశ్వతంగా తమ వద్దే ఉంచుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో శాశ్వతంగా రిక్రియేషన్ క్లబ్, మల్టీకాంప్లెక్స్, థియేటర్లు, స్టార్ హోటళ్లు నిర్మించేందుకు తాత్కాలిక లీజును పునాదిగా చేసుకొంటున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ మాటున కోట్లు కొల్లగొట్టే కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి 100 మంది సభ్యులను ఏర్పాటు చేసుకొని వారి నుంచి సభ్యత్వ రుసుం కింద ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు అంటే రూ.10కోట్లు వసూలు చేసేందుకు తెరలేపినట్లు చర్చ సాగుతోంది. ఇందులో 1000 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో 200 వీఐపీ, 300 మధ్యరకం, 500 చిన్నస్టాల్స్ ఏర్పా టు చేసేలా ప్రణాళిక రచించారని తెలు స్తోంది. వీటికి రేటు పెట్టి వీఐపీ స్టాల్‌కు రూ.10లక్షల చొప్పున మొత్తం స్టాళ్లకు రూ.20కోట్లు, మధ్య రకం స్టాల్‌కు రూ.5 లక్షలు చొప్పున రూ.15కోట్లు, చిన్న స్టాల్‌కు రూ.లక్ష చొప్పున రూ. 5కోట్లు వసూలు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. దీంతో పాటు గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ, ఓ హోట ల్ యజమానితోపాటు, మరికొంత మంది నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసేందుకు కుట్రకు తెరలేపారని, దీనికి ఎగ్జిబిషన్ సొసైటీ ముసుగు వేశారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు.