
ఆలయాల్లో జరిగే వివాహాలపై ప్రత్యేక దృష్టి
ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాలయాల్లో జరిగే వివాహాలపై ఆయా ఆలయాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం ఆయన వాసవ్య మహిళా మండలి, జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మత పెద్దల పేరిట ప్రత్యేక సమావేశం జరిగింది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని వివిధ దేవాలయాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బాల్య వివాహ రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరగకుండా కలిసికట్టుగా కృషిచేయాల్సి ఉందన్నారు. ప్రతి దేవాలయంలో వివాహానికి అర్హత వయసు, వయసు ధ్రువీకరణ పత్రాలు, చట్ట నియమ నిబంధనలు తెలియజేసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలపై ఫిర్యాదు చేసేందుకు 112 నంబరుతో పాటు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయాల్లో ప్రదర్శించాల్సిన వివరాలతో కూడిన నమూనా పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయాల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ఎండోమెంట్ ఏసీ షణ్ముఖ నటరాజన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
టైమ్ బ్యాంక్ ఓ వినూత్న కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో టైమ్ బ్యాంక్ – మేము సైతం(టైం బ్యాంక్– వియ్ టూ) పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని పైలట్ ప్రాతిపదికన అమలుచేయనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం టైమ్ బ్యాంక్ కార్యక్రమంపై యువ వలంటీర్లకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువ వలంటీర్లు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తే వారు ఎంత సమయం పాటు సేవ చేశారనే దాని ఆధారంగా ఆ సమయం టైమ్ బ్యాంక్‌లో కాయిన్ల రూపంలో జమవుతాయన్నారు. వారు సంపాదించిన టైమ్ కాయిన్లను వలంటీర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చని వివరించారు. విశేష సేవలందించిన వలంటీర్లకు డిజిటల్ సర్టిఫికెట్లు, మెరిట్ బ్యాడ్జీలు కూడా ప్రదానం చేయనున్నట్లు వివరించారు. టైమ్ బ్యాంకు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ రైల్వే స్టేషన్, పీఎన్ బస్‌స్టేషన్, ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలుచేయనున్నట్లు తెలిపారు. నాలుగు వారాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత వలంటీర్ల అభిప్రాయాలను సేకరించి, అనంతరం మొత్తం జిల్లా మొత్తానికి ఈ వినూత్న విధానాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు, బంగారు భవిష్యత్తుకు నిర్మాతలుగా తీర్చిదిద్దేందుకు ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ బి.కీర్తి టైమ్ బ్యాంక్ విధివిధానాలు, డిజిటల్ మానిటరింగ్, డ్యాష్‌బోర్డు, ఈ–సర్టిఫికెట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆగిరిపల్లి)కి చెందిన 45 మంది విద్యార్థులతో పాటు డాక్టర్ నాగసుధారాణి, డాక్టర్ శ్రీలత, వాసవ్య మహిళా మండలి వలంటీర్లు పాల్గొన్నారు.