
మద్యం మత్తులో వంట మనిషిపై విద్యార్థుల దాడి
గన్నవరం: మద్యం తాగుతున్నారని మందలించిన వంట మనిషిపై విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టిన సంఘటన మండలంలోని గొల్లనపల్లి ఎస్సీ బాలుర హాస్టల్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉంటున్నారు. కొంత మంది విద్యార్థులు శనివారం సాయంత్రం హాస్టల్ భవనంపై కూర్చొని మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వచ్చిన వంట మనిషి గొల్లనపల్లికి చెందిన కాశిమ్మ విద్యార్థులను మందలించింది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు చెబుతానని హెచ్చరించి వంట చేసేందుకు వెళ్లింది. విద్యార్థులు కొద్ది సేపటి తర్వాత వంట గదిలో కూరగాయలు కోస్తున్న కాశిమ్మపై దుప్పటి కప్పి కొట్టి, గొంతు నులిమే ప్రయత్నం చేశారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో విద్యార్థులు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న కాశిమ్మ విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వైద్య చికిత్స నిమిత్తం ఆమెను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుమారు ఏడుగురు విద్యార్థులు తనపై దాడిచేసినట్లుగా కాశిమ్మ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.