
అదుపులోకి రాని అతిసార!
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ రాజరాజేశ్వరీపేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. నాలుగో రోజు సైతం అతిసార కేసులు నమోద య్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం రాత్రికి 194 కేసులు ఉండగా, శనివారానికి వాటి సంఖ్య 273కి పెరిగింది. అధికారులు మాత్రం అతిసార అదుపులోనే ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాస్పత్రితో పాటు, న్యూరాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కొనసాగుతున్న సర్వే
డయేరియా బాధితులను గుర్తించేందుకు న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన సర్వే కొనసాగుతోంది. వైద్య సిబ్బంది ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడుగుతుంటే, రెండు, మూడు ఇళ్లకు ఒక డయేరియా కేసుతో పాటు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా బయట పడుతున్నారు. ఆ ప్రాంతంలో డయేరియా, సీజనల్ జ్వరాలు ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు.
కలుషిత నీరే కారణం?
అతిసారకు వందశాతం కలుషిత నీరే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం, ఇతర కల్తీ అయితే నాలుగు రోజుల పాటు డయేరియా కేసులు వచ్చే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం నీటి సర ఫరా పూర్తిగా నిలిపివేసినందున, ఎక్కడ కలుషిత మైందో గుర్తించి సత్వరమే అక్కడ మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు మాత్రం నీటి శాంపిళ్లు ల్యాబ్‌కి పంపించామని, రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంటున్నారు.
బాధితులకు పరామర్శ
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను మంత్రి పి.నారాయణ, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శనివారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి అధికారులకు సూచించారు.