
ఏటిపాయకు మళ్లీ వరద
కంకిపాడు: ఏటిపాయకు మళ్లీ వరద వచ్చి చేరింది. వరదనీటితో ఏటిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరవళ్లు తొక్కుతూ వరదనీరు సముద్రం వైపు పరుగులు పెడుతోంది. ఏటిపాయ రహదారి మార్గం మరలా ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయించి లంక పొలాల్లో పనులకు వెళ్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేయటంతో ఏటిపాయ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధి గుండా ప్రవహించే కృష్ణానది ఏటిపాయ రెండు రోజులుగా నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఏటిపాయ అంచులు తాకుతూ నీరు దిగువకు ప్రవహిస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ గుండా లంక పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి మార్గం ఉంది. మొన్నటి వరకూ ఏటిపాయలో నీటి ఉధృతి సాధారణ స్థితికి చేరింది. రాకపోకలు సాధారణ స్థితికి చేరుతాయని భావించారు. అయితే మరలా వరద వచ్చి చేరటంతో లంకపొలాల్లోకి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అయ్యాయి. రహదారి ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవల సాయంతో లంక భూముల్లోకి వెళ్లి పొలం పనులు చూసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఏటిపాయలో వరదనీటి చేరికతో రాకపోకలు సాగటం లేదు. దీంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తుండటంతో పడవలకు డిమాండ్ పెరిగింది.

ఏటిపాయకు మళ్లీ వరద