
దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనం, రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఘాట్‌రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులతో ఓం టర్నింగ్ మొదలు, లక్ష్మీ గణపతి విగ్రహం, చిన్న గాలిగోపురం పాయింట్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో వైపున మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం దర్శనాలు తిరిగి ప్రారంభం కాగా రెండు గంటల వరకు భక్తులతో క్యూలైన్లు రద్దీ కనిపించాయి. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి వారిని, ఉపాలయాల్లో దేవతా మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. మహామండపం రెండో అంతస్తులో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ జరిగింది. మొదటి అంతస్తులో బఫే పద్దతిలో భక్తులకు అన్న ప్రసాదం అందించారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది.
ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ

దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తజనం