
ఉత్సవాల ముసుగు
దుర్గ గుడి ఉత్సవాలకు సమాంతరంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడానికి పార్లమెంటు ముఖ్యనేత సన్నాహాలు గొల్లపూడిలోని మాన్యం భూమి 39.99 ఎకరాల్లో ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు భారీ ఎత్తున వినోద కార్యక్రమాలు, స్టాల్స్, వాహనాల పార్కింగ్ కు ప్రణాళిక వాటిని లీజుకిచ్చి రూ.కోట్లు కొట్టేసేందుకు వ్యూహం
భారీ దోపిడీకి
ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈవెంట్లు నిర్వహించడమే తప్ప ప్రజల సాధకబాధలు గురించి పట్టించుకునే రకం కాదు. గతంలో రాష్ట్రాన్ని ఒక కంపెనీగా, తాను ఒక సీఈఓలా వ్యవహరించిన చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో మైసూరు దసరా ఉత్సవాల స్థాయిలో చేస్తామంటూ విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత సన్నాహాలు చేస్తున్నారు. ఈ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి భారీ ప్రణాళిక రచించారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విజయవాడలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఫార్మా కాలేజి గ్రౌండులో గత రెండేళ్లుగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు కమిటీగా ఏర్పడి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే వారిని పార్లమెంటు ముఖ్యనేత తన వద్దకు పిలిపించుకుని, ఈ ఏడాది అక్కడ ఉత్సవాలు జరపవద్దని, తాను విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. మీరు ఉత్సవాలు నిర్వహిస్తే నేను నిర్వహించే ఉత్సవాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. దానిపై ఇప్పుడు టీడీపీ వర్గాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవు తోంది. పార్లమెంటు ముఖ్యనేత వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చూసీ చూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత విజయవాడ ఉత్సవ్ ముసుగులో భారీ దోపిడీకి ప్రణాళిక రచించారు. శతాబ్దాలుగా అత్యంత ఘనంగా జరుగుతున్న విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు సమాంతరంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను తన అక్రమార్జనకు పార్లమెంటు ముఖ్యనేత వేదికగా చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా విజయవాడ ఉత్పవ్ నిర్వహించడానికి పార్లమెంటు ముఖ్యనేత సిద్ధమయ్యారు. మైసూరులో జరిగే ఉత్సవాల కంటే ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని గొప్పలు చెబుతున్నారు. ఆ ఉత్సవం నిర్వహించడానికి పున్నమి ఘాట్‌ను కేటాయిస్తే వాటిలో స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
అధికారులు నో చెప్పడంతో..
దేవదాయ భూమిపై కన్ను
విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, భక్తుల అవసరాల దృష్ట్యా పున్నమి ఘాట్‌ను కేటాయించలేమని ముఖ్యనేతకు అధికారులు తేల్చి చెప్పారు. దాంతో గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగు పేటలోని సర్వే నంబరు 454లో ఉన్న 39.99 ఎకరాల వెంకటేశ్వర స్వామికి చెందిన భూమిపైన కన్ను పడింది. ఆ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని దేవదాయ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో తన అధీనంలోకి తీసుకున్నారు. మట్టి తోలి చదును చేస్తున్నారు. ఈ భూమిలో విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్, వినోద కార్యక్రమాలు, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు ఉత్సవాల కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతూ ఆ స్టాల్స్‌ను భారీ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి తేర తీశారు. భవిషత్తులో ఈ భూమిని విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో లీజుకు తీసుకొని భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్నారని, టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాలిక్లినిక్ రోడ్డులో ఉత్సవాలు నిర్వహించవద్దని హుకుం...