
డయల్ యువర్ కలెక్టర్‌కు రైతుల నుంచి విశేష స్పందన
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 కాల్స్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాలను నివృత్తి చేసే ఉద్దేఽశంతో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 45 కాల్స్ వచ్చాయి. కలెక్టర్ లక్ష్మీశ ప్రతి ఫోన్ కాల్‌ను స్వీకరించి రైతు చెప్పిన సమస్యను విని, ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి, పరి ష్కారానికి ఆదేశాలిచ్చారు. యూరియా వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలను రైతులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, నేల సారాన్ని కాపాడేందుకు నానో యూరియా ఉపయోగించాలని సూచించారు. విడతల వారీగా అవసరమైన ఎరువులను పంపిణీ చేసే విషయంలో ఎక్కడా ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని, కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారి నాగ మల్లిక తదితరులు పాల్గొన్నారు.