
ఫ్రీ బస్సులతో మా పొట్ట కొట్టారు!
విజయవాడ సిటీ బస్టాండ్‌లో ఆటో కార్మికుల భిక్షాటన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి తమ పొట్ట కొట్టిందంటూ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్(ఇఫ్టూ అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సిటీ టెర్మినల్‌లో ఆటో కార్మికులు వినూత్నంగా చేతుల్లో బొచ్చెలు పట్టుకుని ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. తమ గోడును ప్రయాణికులతో వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఇఫ్టూ నాయకులు కె.పోలారి, దాది శ్రీనివాసరావు, మునిశంకర్‌లు మాట్లాడుతూ ఆటో కార్మికులను చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చ జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకుండా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి రూ.30వేల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 రద్దుతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 18వ తేదీన అన్ని ఆటో మోటారు సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇఫ్టూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు సీహెచ్ పెద్దిరాజు, డి.శ్రీధర్ బాబు, యాదగిరి, సూరిబాబు, వై.అప్పారావు, వలి, రఫీ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.