
అన్నదాన పథకానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. మచిలీపట్నం(ఆజాద్ రోడ్)కు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.2 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్ట్స్, ఆరో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని చింత శివరామకృష్ణ రూ.1,00,116 అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 19 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. నగరంలోని 4వ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని 6వ అడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్డులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానాలు విధించారు. ఒక్కరికి రూ.15 వేలు, 18 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా విధించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కానుకల హుండీలు దొంగతనానికి పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత పోస్టాఫీస్ రోడ్డులో ఉన్న కూర్తాళం పీఠంలో, మెట్లబజార్‌లోని శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పీఠంలోని హుండీని పద్మావతి ఘాట్‌లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని నగదు తీసుకుని హుండీని అక్కడే వదిలి వెళ్లిపోయారు. శివాలయంలోని హుండీలో నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఘాట్‌లోకి వాకింగ్ కోసం వెళ్లిన వాకర్స్ హుండీని చూసి పీఠం నిర్వాహకులకు సమాచారం అందించారు. శివాలయంలో పనిచేసే పని మనిషి బుధవారం ఉదయం గుడి వద్దకు వెళ్లిచూడగా హుండీ పగలగొట్టి ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఫుటేజీల ఆధారంగా రెండు ఆలయాల్లో ఇద్దరు వ్యక్తులే దొంగతనానికి పాల్పడ్డారని, వారు పాత నేరస్తులుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.