
పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్
పటమట(విజయవాడతూర్పు): పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్ అని, విజయవాడ నగరం సుందరంగా– పరిశుభ్రంగా ఉందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) వీఎంసీకి కితాబిచ్చింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ధ్యానచంద్ర చాంబర్‌లో జీఈఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి నగరంలో వారి పరిశీలను వివరించారు. వీఎంసీ–యూనిడో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామలింగేశ్వర నగర్ 20 ఎంఎల్‌డీ సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) పునరుద్ధరీకరణ, బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ పురోగతిపై జీఈఎఫ్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ జీఈఎఫ్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీఎంసీ పర్యావరణ పరిరక్షణకు వీఎంసీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడం కోసం మరింత నిధులు అవసరమని, వారి ఆర్థిక సహాయంతో కేవలం వాడుక నీరు శుద్ధి చేయడమే కాకుండా, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి కాలువల డ్రెయిన్లు వంటివి నిర్మించేందుకు వారి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం జీఈఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలెట్ ఇన్ ఇండియా(సీఐఏపీ) ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఐదు పైలట్ నగరాలను ఎంపిక చేశామన్నారు. విజయవాడతో పాటు గుంటూరు, మైసూర్, భోపాల్, జైపూర్ నగరాల్లో ఈ ప్రాజెక్టుని అమలు చేశారని, ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంతర్జాతీయ పరిశీలకుడు రోనాల్డ్ వంగ్, జాతీయ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్ ష్రాఫ్, యూనిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, యూనిడో నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపిక శ్రీపాద, వీఎంసీ అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.