
చవితి వేడుకలు నిర్వహిస్తున్న బాషా ఆదర్శనీయం
ఘంటసాల: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడైన అక్బర్ బాషా(షామియాన) ఆధ్వర్యంలో ఘంటసాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని కృష్ణా మిల్క్ యూనియన్, వినాయక చవితి కమిటీ రాష్ట్ర చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఘంటసాలలో బాషా ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి వేడుకల్లో ఆంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చలసాని నిర్వాహకుడు అక్బర్ బాషా(షామియాన) – షర్మిల దంపతులను సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందించి అభినందించారు.
దేశాభివృద్ధికి యువత సహకరించాలి
అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఘంటసాల గ్రామంలో బాషా ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా వినాయక చవితి ఉత్సవాలతో ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమన్నారు. మొదటి రోజు పీటల మీద కూర్చుని వినాయకునికి పూజలు చేసిన బాషా, షర్మిల దంపతులను అభినందించారు. కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి యువత సహకరించాలని కోరారు. ముందుగా శ్రీ జలధీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంజనేయులను టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 2 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమాన్ని చలసాని స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగినట్లు అక్బర్ బాషా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి, పీఏసీఏస్ చైర్‌పర్సన్ బండి పరాత్పరరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, పాలకేంద్రం అధ్యక్షుడు గొర్రెపాటి సురేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.