
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తిరువూరు: మండలంలోని వావిలాలలో కుటుంబ సమస్యల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు మండలం వావిలాల శివా రు రాజుగూడెంకు చెందిన చాట్ల వెంకటేష్(50)కి ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె విజయవాడలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. కుమార్తెకు తోడుగా వెంకటేష్ భార్య లక్ష్మి కూడా విజయవాడలో నివసిస్తోంది. ఆమెను రాజుగూడెం రావలసిందిగా పలుమార్లు ఒత్తిడి చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై వెంకటేష్ పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన వెంకటేష్‌ను సోమవారం ఉదయం గమనించిన స్థానికులు తిరువూరు ప్రైవేటు నర్సింగ్‌హోంకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గవర్నర్‌పేట ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద జరిగింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె కర్నాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా తులగిరికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతురాలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు గవర్నర్‌పేట స్టేషన్(0866 2576023)లో సంప్రదించాలని కోరారు.