
సామాన్యులకు దూరం
ఆర్జితం..
సిఫారసులు ఉంటేనే ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవాభాగ్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఆర్జితసేవాభాగ్యం సామాన్య భక్తులకు దూరమవుతోంది. రికమండేషన్లు ఉంటే చాలు ఆర్జిత సేవలు దరిచేరుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో పాటు సేవల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు, కార్యాచరణలో కానరావడం లేదు. కొన్ని నెలలుగా ఆర్జిత సేవ టికెట్ల విక్రయాలపై ఈవో పేషీ అజమాయిషీ పెరిగిపోవడంతో టికెట్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈవో చాంబర్ లేదా ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తేనే తప్ప ఆర్జిత సేవా టికెట్లు పొందలేని పరిస్థితి ఎదురవుతోంది.
నాడు ఎంతమందికై నా.. నేడు పరిమితం
గతంలో ఎంతమంది వచ్చినా ఇచ్చిన ఆర్జిత సేవల టికెట్లను ఇప్పుడు పరిమితం చేశారు. రానున్న దసరా ఉత్సవాల్లో సైతం అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నిర్వహించి, భక్తుల ఇళ్ల నుంచే సెల్‌ఫోన్, కంప్యూటర్ల ద్వారా వీక్షించేందుకు యత్నించారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయనే భావనతో దేవస్థానంతో పాటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది.
ఖడ్గమాల టికెట్లు కావాలంటే ఈవో పేషీనే!
దుర్గమ్మ ఆర్జిత సేవల్లో తెల్లవారుజామున జరిగే ఖడ్గమాలార్చనకు అధిక డిమాండ్ ఉంది. గతంలో ఈ సేవకు పరిమిత సంఖ్యలో టికెట్లను మాత్రమే అనుమతించేవారు. టికెట్ ఖరీదు రూ. 5 వేలు ఉన్నా, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఒక్కో రోజు 30కి పైగా టికెట్లు జారీ చేసి రెండు షిప్టుల్లో ఈ పూజ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్‌లో పది టికెట్లు, ఆర్జిత సేవా కౌంటర్‌లో మరో పది టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక మిగిలిన పది టికెట్లు ఈవో పేషీకే. ఈ పదితో పాటు మరి కొన్ని అదనంగా కావాలన్నా అక్కడి నుంచే సిఫారసు చేయించుకోవాలి. అయితే 30 టికెట్లు విక్రయిస్తున్నా సామాన్య భక్తుడు ఆన్‌లైన్‌లో కానీ, దేవస్థాన ఆర్జిత సేవా కేంద్రంలోగానీ టికెట్ పొందాలంటే సాధ్యం కాదు. దాదాపు నెల రోజుల ముందుగా టికెటు కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండవు.
ప్రముఖుల నుంచి ఫోన్ చేయిస్తేనే టికెట్
ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఫోన్ చేయించేవారు నిమిషాల్లోనే టికెట్ పొందడం విశేషం. దీనికి కేంద్రబిందువుగా ఈవో పేషీ ఉందని దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది. నెల రోజుల ముందు దొరకని టికెట్ ఈవో పేషీలో అడిగితే సేవ కోరిన ముందు రోజు రాత్రికి అందిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరును ప్రశ్నించే భక్తులకు సీఎం పేషీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల మీద నెపాన్ని నెట్టేస్తున్నారు.
సామాన్యులు అడిగితే.. నో
భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు టికెట్లు విక్రయించి అందరికీ క్యూలైన్‌లో నిల్చునే అవకాశం ఉండేది. కొన్ని రోజులుగా ఆర్జిత సేవ టికెట్లకు కోత విధించారు. నిత్యం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్‌తో పాటు సమాచార కేంద్రంలో టికెట్లను విక్రయిస్తారు. టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రముఖులు, పోలీసు, ప్రజా ప్రతినిధులు సిఫారసులు ఉన్నవారు ముందుగానే ఈ టికెట్లను తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు వచ్చి అడిగితే ‘నో టికెట్స్’ అంటున్నారు. అదే ఆలయ ముఖ్య అధికారుల నుంచి ఫోన్ వస్తే పంచహారతుల టికెట్లు లేకున్నా రూ. 500 ఆశీర్వచన టికెట్ ఇచ్చి సేవలోకి అనుమతించడం విశేషం.
విశేష పర్వదినాల్లో చండీహోమానికి పరిమితులు
అమావాస్య, పౌర్ణమితో పాటు ఇతర విశేష పర్వదినాల్లో చండీహోమం టికెట్లకు ఆలయ అధికారులు పరిమితులు విధించారు. నిత్యం వంద చండీహోమానికి టికెట్లను విక్రయిస్తుండగా, పండుగలు, పర్వదినాల్లోనే దాదాపు ఇదే సంఖ్యలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఆలయ కౌంటర్‌లో 60 టికెట్లు, ఆన్‌లైన్‌లో మరో 40 టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, ఇతర పర్వదినాలలో టికెట్లు దొరికితే చాలు అనుకునే భక్తులు పదుల సంఖ్యలో ఉంటారు. యాగశాల బయట అరుగులపై కూర్చుని కూడా ఈ సేవలో గోత్రనామాలు చెబితే చాలనుకుంటారు. ఇప్పుడు అధికారుల తీరుతో కనీసం సేవ చేయించుకునే భాగ్యం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్, కౌంటర్లలో అరకొరగా టికెట్లు
ఖడ్గమాలార్చన టికెట్లు పేషీ నుంచే...!
పంచహారతుల టికెట్లకుతప్పని రికమండేషన్లు
విశేష పర్వదినాల్లో చండీహోమానికి ఇదే తీరు
పంచహారతుల టికెట్లలో కోత
ఇక దుర్గమ్మకు నిర్వహించే నిత్య ఆర్జిత సేవల్లో పంచహారతుల సేవ మరొకటి. నిత్యం సాయం సమయంలో ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతులు, వేద స్వస్తి జరుగుతుంది. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులు సుమారు అరగంట క్యూలైన్లో నిల్చుని అమ్మవారి ముగ్ధమనోహరమైన రూపాన్ని తనివి తీరా వీక్షించే భాగ్యం కలుగుతుంది. దీంతో పంచహారతుల్లో పాల్గొనేందుకు భక్తులతో పాటు ప్రముఖులు నిత్యం ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. ఇటీవల ఆలయ ఈవో ఈ పంచహారతుల టికెట్లను 20కే పరిమితం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవా కౌంటర్‌లో పది, సమాచార కేంద్రంలో మరో పది టికెట్లు విక్రయిస్తారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు.
అదిగో.. ఇదిగో..
దాతలు రూ. 5 కోట్లు వెచ్చించి రాతితో నూతన యాగశాల నిర్మాణం చేపట్టినా అందులో మిగిలి ఉన్న పనులను చేయించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. చైత్రమాసం నుంచి యాగశాలలో చండీహోమం నిర్వహణ అదిగో... ఇదిగో అంటూ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం ఆలయ ఇంజినీ రింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మార్లు నూతన యాగశాలలో హోమాలు జరిపిస్తామని చెబుతున్న దేవస్థాన అధికారులు భక్తుల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

సామాన్యులకు దూరం