
రాష్ట్రాభివృద్ధిలో ఆప్కాబ్ కీలకపాత్ర
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 62వ స్థాపన దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా స్థాపించిన ఈ బ్యాంకు ఇప్పుడు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ దేశంలో పెద్ద స్థాయిలో కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన కొద్ది సహకార బ్యాంకుల్లో ఆప్కాబ్ ఒకటన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడుతి రాజశేఖర్, కమిషనర్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎ.బాబు, ఆప్కాబ్ పర్సన్ ఇన్‌చార్జి వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద సహకార డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ అయిన పీఏసీఎస్ కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో ఆప్కాబ్ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.