
కూటమి పాలనలో రైతుకు భరోసా ఉండదు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతుల జీవితాలకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు రుజువు చేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులపై పగబట్టిందని విమర్శించారు. శనివారం జరిగిన దర్శి పర్యటనలో భాగంగా కూటమి అధికారంలో ఉంటే రైతులకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడమే నిదర్శనమన్నారు. రైతుభరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన లబ్ధిని కూటమి నేతలే దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 7 లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయలు నిలిపివేశారని పేర్కొన్నారు. రైతులకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టే దిశగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంస్కరణలు అమలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రైతులకు చేయూతనందించేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.