
కమ్యూనిటీ హాల్స్ పోలీసులకా..!
●క్యాన్సిల్ చేశాం.. ప్రత్యామ్నాయం చూసుకోండి అంటున్న అధికారులు
●విజయవాడ 17వ డివిజన్‌లో హాల్స్ బుక్ చేసుకున్న వారి ఆవేదన
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్‌ను ప్రజావసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల ముందు శుభకార్యాల కోసం బుక్ చేసుకుంటే ఇంకా మూడు రోజులే ఉండగా క్యాన్సిల్ చేస్తున్నాం ప్రత్యామ్నాయం చూసుకోండని చెప్పడంతో ఏమి చేయాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. రాణిగారితోట 17వ డివిజన్‌లోని సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 7,9,13 తేదీల్లో శుభకార్యాలు చేసుకునేందుకు స్థానికులు నెల క్రితమే నగదు చెల్లించి బుక్ చేసుకున్నారు. అయితే శనివారం అధికారులు వచ్చి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇతర జిల్లాల నుంచి వస్తున్న పోలీస్ సిబ్బందికి షెల్టర్ కోసం కమ్యూనిటీ హాల్‌లను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారని బుక్ చేసుకున్నవారు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆదివారం ఉదయం ఆయా కమ్యూనిటీ హాళ్లకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని తరలించి తమను ఇబ్బంది పెట్టొదని వారు కోరుతున్నారు.