
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కృత్తివెన్ను: కృత్తివెన్ను ప్రధాన సెంటర్‌లో 216 జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. సంగమూడి గ్రామానికి చెందిన కూనసాని వీరనారాయణస్వామి (55) ఆదివారం చర్చ్‌లో ప్రార్థనకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి ఇంటికి సైకిల్‌పై వస్తుండగా కృత్తివెన్ను ప్రధాన సెంటర్‌లో వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఘటనలో నారాయణస్వామి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కమృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బందరు తరలించారు.
మరో ఘటనలో
తిరువూరు: చీమలపాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. కృష్ణారావుపాలెం శివారు కేశ్యా తండాకు చెందిన బాణావత్ సంధ్యా నాయక్ కుమారుడు యశ్వంత్(6)తో ద్విచక్రవాహనంపై చీమలపాడు వచ్చారు. అక్కడ తినుబండారాలు తీసుకువచ్చే నిమిత్తం రోడ్డు దాటుతున్న యశ్వంత్‌ను తిరువూరు నుంచి విజయవాడ వెళ్లే కారు ఢీకొంది. తలకు బలమైన గాయం కాగా బాలుణ్ణి మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సంధ్యానాయక్‌కు ముగ్గురు కుమార్తెల తర్వాత జన్మించిన యశ్వంత్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.