
కలగా.. కల్పనగా..
పెడన: చంద్రబాబు ఎన్నికల వేళ కలంకారీ వ్యాపారులకు ఇచ్చిన హామీ నీటిమూటలా మారే పరిస్థితి ఎదురవుతోంది. పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు కలగా మిగిలిపోతుందేమోననే సంశయం ఆ వ్యాపారులను కలవరపెడుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు పెడనలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
ముందుకు అడుగులు పడని అధికారుల హడావుడి
అధికారులు నానా హడావుడి చేశారు. దీంతో క్లస్టర్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయని అంతా భావించారు. స్థానిక కలంకారీ పరిశ్రమల యాజమానులు, అనుభవజ్ఞులతో క్లస్టర్ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో కొందరు ఇతర రాష్ట్రాలకు సొంత ఖర్చులతో వెళ్లి పరిశీలించి వచ్చారు. దీనిపై జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖాధికారులతో సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు.
నెలలు గడుస్తున్నా ఊసే లేదు
ఆ తర్వాత నెలలు గడుస్తున్నా దాని ఊసే లేదు. కారణం క్లస్టర్ ఏర్పాటుకు సుమారు రూ.వందల కోట్లు అవసరం. ప్రైవేటు స్థలం, యంత్రాల కొనుగోలుకు రూ.కోట్లు వెచ్చించాల్సి ఉండటంతో తాత్కాలికంగా బ్రేక్ పడిందని, నిధులు లభ్యత అవ్వగానే పనులు చేపడతామనే వాదనను అధికార పార్టీ వారు పేర్కొంటున్నారు. ఈ బ్రేక్ శాశ్వతమా లేక కలగానే మారుతుందా అనేది ప్రశ్న. అయితే గతంలో ‘కలంకారీ’ కోసం నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటనే దిశగా కొందరికి ఆలోచనలు వస్తున్నాయి. ఇది కూడా అలాగా మిగిలిపోతుందా అనేది పట్టణంలో చర్చనీయాంశమైంది. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితిని పరిశీలిస్తే అవి నిరుపయోగంగా ఉన్నాయి.
ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో....
ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్ ఆర్మీ జవాను సువర్ణరాజు పెద్ద మనసుతో తన సొంత స్థలంలో సుమారు 15 ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ రుణంతో పెడన బైపాస్ రోడ్డులో మచిలీపట్నం వైపు కలంకారీ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. కొన్నాళ్లు శిక్షణ తరగతులు జరిగాయి. ఆ తర్వాత ఏమైందోగానీ దీన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఆ తర్వాత సువర్ణరాజు మరణించడం, ఆ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఆ భవనం గొడవల్లో ఉండటంతో దాన్ని ఎవరూ పట్టించు కోవడం లేదని తెలుస్తోంది.
టూరిజం ఆధ్వర్యంలో భవనం.. ఎస్టీల నివాసం
పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే టూరిజం వారు పక్కా భవనాన్ని రూ. లక్షలు వెచ్చించి నిర్మించారు. కలంకారీకి సంబంధించి అన్నీ వివరించడానికి గైడ్‌ను ఏర్పాటుచేసి టూరిస్టులకు తెలియజేసేందుకు చర్యలు తీసుకున్నారు. భవనం నిర్మించారే తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. రూ.లక్షలు పెట్టి కట్టిన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దీనిలో ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి.
నిరుపయోగంగా ఫెసిలిటీ సెంటర్
చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో కలంకారీ ఫెసిలిటీ సెంటరును ఏర్పాటు చేశారు. ఇది కూడా నిరుపయోగంగా ఉంది. మూసి ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఏడాదిలో ఒకసారి తెరుస్తూ అవకాశం ఉన్నప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారు.
నిర్మించి వదిలేశారు
రూ.లక్షలు పెట్టి భవనాలు నిర్మించి ఖాళీగా వదిలేయడంపై కలంకారి వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఆ సందర్భంగా నాటి ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలంకారీ వస్త్రా వ్యాపారులు ఘనంగా సత్కరించిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుపై నీలినీడలు ఎన్నికల హామీ నీటి మూటేనా! గతంలో కలంకారీ అభివృద్ధికి నిర్మించిన భవనాలు నిరుపయోగం