11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు | - | Sakshi
Sakshi News home page

11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

Aug 3 2025 8:42 AM | Updated on Aug 3 2025 8:42 AM

11 మం

11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న 11 మంది చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, హీలింగ్‌ లిటిల్‌హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పీవీ రామారావు చెప్పారు. విజయవాడ సూర్యారావుపేటలోని ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకూ నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో బెంగళూరుకు చెందిన పిడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ బీఆర్‌ జగన్నాధ్‌, ఆంధ్రా హాస్పిటల్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగేశ్వరరావుతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా తమ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు నిర్వహించి 11 మందికి సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ తమ ఆస్పత్రిలో 4800 వరకు సర్జరీలు ఇంటర్వెన్షన్స్‌ చేశామన్నారు. ఆంధ్రా హాస్పిటల్‌ పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విక్రమ్‌ ఆధ్వర్యంలో పిడియాట్రిక్‌ కార్డియాలజీ టీమ్‌ ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీటీ సర్జన్లు డాక్టర్‌ బీఆర్‌ జగన్నాధ్‌, డాక్టర్‌ నాగేశ్వరరావు, పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విక్రమ్‌, కార్డియాక్‌ ఎనస్థిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్‌లను

తనిఖీ చేసిన డీఆర్‌ఎం

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): 2027వ సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్‌లను అధికారులతో కలసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాలతో రాజమండ్రి స్టేషన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్‌ యార్డులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను పరిశీలించి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్‌ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లలో ప్రత్యక కార్యాచరణతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్‌లో అదనపు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, టికెట్‌ బుకింగ్‌ పాయింట్‌లు, పార్కింగ్‌ స్థలాల ఆధునికీకరణ, సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పాయింట్‌లు, సిట్టింగ్‌ ప్రదేశాలు, షెల్టర్‌లు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను అధికారులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.

11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు 1
1/1

11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement