
బెజవాడలో విస్తృతంగా తనిఖీలు
శక్తి, ఈగల్ బృందాలతో అవగాహన కార్యక్రమాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించేందుకు నగరంలో ఈగల్, శక్తి ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లాలో శక్తి బృందాలు, మహిళా పోలీస్‌స్టేషన్ అధికారులు, సిబ్బంది కళాశాలలు, పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, ఆపద సమయంలో చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కలిగిస్తున్నారు. శనివారం నగరంలోని పలు పాఠశాలల్లో సందర్శించారు. రాత్రి వేళ్లలో గస్తీ తిరుగుతూ బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారిని గుర్తిస్తున్నారు. ఇంటర్ సెప్టర్, యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలను నిర్వహించి 109 మంది వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిలో 48 మంది అనుమానిత వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన 16 మందిని అదుపులోనికి తీసుకుని తగు చర్య నిమిత్తం వారిని సంబంధిత పోలీసు స్టేషన్‌లకు అప్పగించారు. ఈ క్రమంలో వివిధ ప్రదేశాల్లోని 11 పాన్ షాప్ /బడ్డీ కొట్లను తనిఖీ చేశారు. లేడీస్ హాస్టళ్ల సమీపంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.