
బోధనేతర పనులు అప్పగించొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బోధనేతర పనులతో ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో ధర్నా జరిగింది. ధర్నాలో పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోందన్నారు. వీటిపై ఈనెల 5వ తేదీ లోపు ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలతో చర్చలు జరపాలని, లేని పక్షంలో యాప్‌లను బహిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా నాలుగు డీఏ బకాయిలు ఇవ్వలేదని, 12వ పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయకూడదన్నారు. ధర్నాలో ఫ్యాప్టో కార్యదర్శి ఇమామ్ బాషా, ఖాసిం, రాధిక, కొమ్ము ప్రసాద్ పాండురంగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ధర్నా