
యనమలకుదురు లాకుల వద్ద గుర్తు తెలియని మృతదేహం
పెనమలూరు: యనమలకుదురు లాకుల వద్ద గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు రావడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు లాకుల వద్ద పురుష మృతదేహం నీటిలో కొట్టుకు వచ్చింది. మృతుడి వయస్సు 45 నుంచి 50 మధ్య ఉంటుంది. మృతదేహం కుళ్లి పోయి కనిపిస్తోంది. మృతుడి శరీరంపై చొక్కా, చిరిగిన ప్యాంట్ ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అదృశ్యమైన వృద్ధురాలు శవమై కనిపించారు
కోడూరు: అదృశ్యమైన వృద్ధురాలు చెరువులో పడి మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన చందన రాంప్రసాదం (90) శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువులో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పరిశీలించగా రాంప్రసాదంగా గుర్తించినట్లు ఎస్‌ఐ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతురాలి మనవడు మనోజ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
566.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 566.70 అడుగులకు చేరింది. ఇది 248.2946 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 67,556 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

యనమలకుదురు లాకుల వద్ద గుర్తు తెలియని మృతదేహం