
‘మెడికల్ ఎంప్లాయీస్’ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎంపి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ గుర్తింపు సంఘం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జరిగిన ఎన్నికల్లో అన్ని పోస్టులకు సింగిల్ నామినేషన్‌లు దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.శేషయ్య ప్రకటించారు.
కార్యవర్గం వీరే
జిల్లా అధ్యక్షుడుగా వై.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎ.నిర్మలరత్నకుమారి, టి.విజయకుమార్, ఆర్.నల్లయ్య, ఎం.సుధాకర్‌బాబు, డాక్టర్ జి. ప్రవీణ్‌కుమార్‌ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.నాగరాజు, డిప్యూటీ సెక్రటరీగా టి.సాంబయ్య తదితరులు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎం ప్రసాద్ వ్యవహరించనున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి సత్యనారాయణ, గిరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.
సమస్యల పరిష్కారానికి సిద్ధంకండి
ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి ఉంటుందని సంఘ రాష్ట్ర నాయకులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ వేసి 36 శాతం ఐఆర్ చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల సహాయ అధికారిగా ఎ.రాధ వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నక్క రమేష్, మెడికల్ కాలేజీ గౌరవ అధ్యక్షులు రాముడు తదితరులు పాల్గొన్నారు.