
దేవరకొండలో నీట మునిగిన పొలాలు
దేవరకోట(ఘంటసాల): అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆకుమడులు, నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయని నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె జగదీష్ డిమాండ్ చేశారు. ఘంటసాల మండలం దేవరకోటలోని ఘంటసాల – రామానగరం ప్రధాన రహదారి గుండేరు డ్రెయిన్ వద్ద ఉన్న వంతెనపై జగదీష్ ఆధ్వర్యంలో సన్న, చిన్న కారు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ గుండేరు డ్రెయిన్‌లో గుర్రపు డెక్క, తూటుకాడ భారీగా పేరుకుపోయిందన్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువ ప్రవహించే పరిస్థితి లేదన్నారు. దీంతో నీరు ఎగతట్టి దిగువ బాగంలో ఉన్న దిబ్బ చేలు, మూలగొంది పొలాలు, చిట్టూర్పు పొలాలు, ఇతరప్రాంతాల్లో ఆకుమడులు, నాట్లు వేసిన సుమారు 300 ఎకరాల్లో పొలాలు పూర్తిగా నీట మునిగాయని చెప్పారు. దీనిపై రెండు మూడు రోజులుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గుండేరు పరివాహక ప్రాంతంలో ఉన్న వంతెనల వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటు కాడ, మొదలగు వ్యర్థాలను మిషన్ల ద్వారా తొలగించాలన్నారు. రైతులు, కౌలు రైతులు జాస్తి రామచంద్రబాబు, కొప్పుల వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, సన్న, చిన్న కారు రైతులు పాల్గొన్నారు.
అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
గుండేరు డ్రెయిన్ వద్ద రైతుల ధర్నా