
లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మెరుగుపరుచుకుని వారితో మర్యాదగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో పింఛన్ పంపిణీ అధికారులతో కౌన్సెలింగ్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి నెలా అధికారులు ఐవీఆర్‌ఎస్, 1100 కాల్ సెంటర్ల ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కనీసం ఐదుగురు లబ్ధిదారుల స్పందనను తెలుసుకుంటున్నారన్నారు. జిల్లాలో గత మూడు నెలలుగా పింఛన్ పంపిణీ కార్యక్రమంపై ప్రతికూల స్పందన వస్తోందన్నారు. దీనిలో కారణాలను పరిశీలిస్తే పింఛన్ ఇస్తున్నామా, లేదా, నగదు మొత్తం కచ్చితంగా ఇస్తున్నామా, లేదా, సమాయానికి ఇవ్వలేకపోతే వారికి నచ్చజెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నామా, లేదా అనే విషయాలను ప్రతి ఒక్కరూ విశ్లేషించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, లబ్ధిదారుల నుంచి ప్రతికూల ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ పాల్గొన్నారు.
కృష్ణా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ