
పద కవితకు ఆద్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ బాధ్యుడు డాక్టర్ సీహెచ్ రామ్మోనరావు అన్నారు. శ్రీ వేంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస) కంచి కామకోటిపీఠం శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 8 రోజులపాటు నిర్వహించే జాతీయ అన్నమయ్య సంగీత మహోత్సవాలు లబ్బీపేటలోని శ్రవణ సదనంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. రామ్మోనరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు భాషా వీచికలుగా అభివర్ణించారు. లలిత కళలతోనే మనో వికాసం కలుగుతుందన్నారు. తొలిరోజు నృసింహ జయంతి సందర్భంగా తరికొండ వెంగమాంబ జయంతిని నిర్వహించారు. వెంగమాంబ రచించిన సంకీర్తనలను సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనరసమ్మ, శ్రేష్ట మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు, మానస, లాస్యలు మధురంగా ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. నగరానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు.