
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత కావాలి
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
కృష్ణలంక(విజయవాడతూర్పు): భారత రాజ్యాంగ పరిరక్షణ వర్తమానంలో అందరి బాధ్యత కావాలని సీనియర్ పాత్రికేయుడు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పాలనకు పక్షవాతం సోకిందని, ఫెడరలిజానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా భారతదేశ ఫెడరల్ వ్యవస్థ–ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన సోమవారం స్మారకోపన్యాసం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఫోర్త్ ఎస్టేట్‌లో ప్రశ్నించే ధోరణి లేదు..
అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించినా వాటికి భంగం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం కావడం ప్రమాదకరమన్నారు. ఎంతో ముందు చూపుతో అత్యున్నత రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 200, 201 ప్రకారం బిల్లుల ఆమోదానికి పరిధి ఉన్నప్పటికీ రాష్ట్రపతి ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైనాన్స్ ఫెడరలిజం అనేది ప్రశ్నార్ధకం అయ్యిందన్నారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సి ఉండగా డేటా చట్టం పేరుతో సమాచారం లేకుండా చేస్తున్నారని, ఫోర్త్ ఎస్టేట్‌లో ప్రశ్నించే ధోరణి మాయమవుతుందని చెప్పారు. రాజ్యాంగం విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను గవర్నర్ అడ్డుకుంటే ఇక ఫెడరలిజం ఎక్కడుందని ప్రశ్నించారు. విచక్షణ లేని వారంతా గవర్నర్ స్థానంలో ఉండడం వలన పాలన కూడా పక్షవాతం బారిన పడుతోందన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశంలో ఇలాంటివి శ్రేయస్కరం కాదని, ప్రజలే భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పి.రామరాజు, టి.క్రాంతి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.