
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్‌జంక్షన్‌రూరల్: హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు మూడో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1,008 చామంతి పూలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై కోదండ రామాంజనేయ భజన మండలి (బిళ్లనపల్లి) భక్త బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట సాయికృష్ణ భజన మండలి మహిళలు నిర్వహించిన కోలాటం ఆద్యంతం ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన ‘డ్యాన్స్ బేబి డ్యాన్స్’ నృత్య ప్రదర్శన, నవీన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ అలరించింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.