
పోలీస్ ప్రజావాణిలో 89 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 89 మంది ఫిర్యాదులు అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీలు ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 42, కుటుంబ కలహాలపై తొమ్మిది, కొట్లాటకు సంబంధించి ఏడు, మహిళా సంబంధిత నేరాలపై ఏడు, సైబర్ నేరాలపై మూడు, దొంగతనాలపై రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలు, సంఘటనలపై 19 మంది ఫిర్యాదులు అందజేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు డీసీపీలు ఆదేశాలిచ్చారు.
925 వెండి నాగపడగలు సమర్పించిన అజ్ఞాత భక్తులు
ఘంటసాల: స్థానిక నాగేంద్ర స్వామి పుట్ట వద్ద అజ్ఞాత భక్తులు వెండి నాగ పడగలు వేసి వెళ్లినట్లు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ(ట్రస్టీ), గొర్రెపాటి జగన్మోహనరావు, గొర్రెపాటి సురేంద్ర సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సంతాన సాఫల్య స్వామిగా పేరుగాంచిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ(షష్టి గుడి) ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు వెండితో చేసిన నాగ పడగలు పుట్టపై వేసి వెళ్లిపోయారన్నారు. వీటిని ఆలయ సిబ్బంది గుర్తించి తమకు అందజేశారని చెప్పారు. వాటిని లెక్కించగా 925 నాగ వెండి పడగలు ఉన్నాయన్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందు వల్లే ఇలా మొక్కబడి తీర్చుకుని ఉంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా పుట్టపై భక్తులు వెండి నాగ పడగలు వేశారని, ఆ భక్తులకు స్వామి వార్ల ఆశీస్సులు అందించాలని కోరారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్తలు అంచనా వేశారు.

పోలీస్ ప్రజావాణిలో 89 ఫిర్యాదులు