లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా విజయవాడకు చెందిన డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కేశవరావు బాబు మధుమేహం, రక్తపోటుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు తెలుగులో రచనలు చేసి, వైద్య పరిశోధనల్లోనూ తనదైన ముద్ర వేశారు. నగరంలో ఓడీఏ ప్రాజెక్టు వైద్యాధికారిగా, పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా, వీఎంసీ స్కూల్ హెల్త్ ఆఫీసర్‌గా సేవలు అందించారు. ఐఎంఏ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులవడంతో పలువురు అభినందనలు తెలిపారు.
వీఎంసీ ఆర్‌ఎఫ్‌వోకు
ఉత్తమ సేవా పతకం
పటమట(విజయవాడతూర్పు): వీఎంసీలోని అగ్నిమాపక విభాగంలోని రీజనల్ ఫైర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావుకు ఉత్తమ సేవా పతకం లభించింది. తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా 32 ఏళ్లపాటు విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ ఫైర్ సర్వీస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు.
మద్యానికి బానిసైన వ్యక్తి బలవన్మరణం
పెనమలూరు: తాడిగడపలో ఓ వ్యక్తి మద్యానికి బానిసగా మారి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప కార్మికనగర్‌కు చెందిన గరికే గోపి తన తల్లితండ్రులు, సోదరుడు గరికే సాంబశివరావు(25)తో కలిసి ఉంటున్నారు. అందరూ కూలీ పనులు చేస్తారు. కాగా సాంబశివరావు మద్యం, ఇతర దురలవాట్లకు బానిసగా మారటంతో అతని భార్య విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సాంబశివరావు మద్యం అధికంగా తాగుతున్నాడు. అయితే ఆదివారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో సిల్క్ చీరతో మెడకు ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన గోపి చీరకు వేలాడుతున్న సాంబశివరావును రక్షించే యత్నం చేయగా అప్పటికే అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కేశవరావు బాబు