తప్పు చేసి తప్పించుకోలేరు.. కోవిడ్‌ రిలీఫ్‌ మోసాల విచారణకు ప్రత్యేక డైరెక్టరేట్‌

Justice Department Announces Director for COVID Fraud Enforcement - Sakshi

అమెరికాపై ఎన్ని విమర్శలు ఉన్నా .. పారదర్శకత కోసం ప్రయత్నించడంలో ఎప్పుడూ వెనుకబడలేదు. ఇందుకు సాక్షంగా నిలుస్తోంది అక్కడి ‍న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం. కోవిడ్‌ కష్టకాలంలో సాయంగా ప్రకటించిన భారీ మొత్తంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో చోటు చేసుకుని అవినీతి ఆరోపణలపై విచారించేందుకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌. 

2020లో కోవిడ్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున​‍్న సమయంలో యూఎస్‌లో కూడా లాక్‌డౌన్‌ విధించారు. ఇది దీర్ఘకాలం కొనసాగడంతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రజల సంక్షేమ చర్యల్లో భాగంగా 2.2 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో సుమారు 8  బిలియన్‌ డాలర్లు పూర్తిగా పక్కదారి పట్టినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మోసాల విచారణకు ప్రత్యేక డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్‌గా అసోసియేట్‌ డిప్యూటీ ఆటార్నీ జనరల్‌ కెవిన్‌ చాంబర్స్‌ని నియమించారు. 
- తప్పుడు సమాచారంతో సుమారు 6 బిలియన్‌ డాలర్ల కోవిడ్‌ రిలీఫ్‌ సాయం పొందిన 1800ల మంది వ్యక్తులు. వీరిపై నమోదైన 240 కేసుల విచారణ
- వన్‌ బిలియన్‌ డాలర్ల కోవిడ్‌ సహాయ నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్న వెయ్యి ముద్దాయిలపై ఉన్న కేసులు 
- వన్‌ బిలియన్‌ డాలర్ల విలువైన ఎకనామిక్‌ ఇంజ్యూరీ డిసాస్టర్‌ లోన్‌ మంజూరు విషయంలో వస్తున్న ఆరోపణలపై స్పెషల్‌ డైరెక్టరేట్‌ విచారణ జరపనుంది.

కోవిడ్‌ రిలీఫ్‌ సహాయ చర్యల మోసాలకు సంబంధించిన విచారణలో సివిల్‌, క్రిమినల్‌, పరిపాలన ఇలా అన్ని విభాగాల సాయం తీసుకోనున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం సేకరించినట్టు న్యాయశాఖ చెబుతోంది. ప్రస్తుతం కేసు విచారణకుఏ సహాకరించేలా డేటా విశ్లేషణ పెద్ద ఎత్తున జరుగుతోంది. 

కోవిడ్‌ రిలీఫ్‌ కింద ప్రకటించిన భారీ మొత్తంతో నేరుగా ఆర్థిక సాయం చేయడంతో పాటు పీపీఈ కిట్ల కొనుగోలు, రుణాల మంజూరు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయల పెంపు, క్వారెంటైన్‌ సెంటర్ల ఏర్పాటు  ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను ఆదుకోవడమలే లక్ష్యంగా చాలా వేగంగా యుద్ధ ప్రతిపాదికన ఈ పనులు చేపట్టడాన్ని.. అవకాశంగా మలుచుకున్న కొందరు అవినీతికి తెర లేపారు. 

కోవిడ్‌ నిధుల దుర్వినయోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అనేక కేసులు నమోదు అయ్యాయి. అయితే కోవిడ్‌ కల్లోలం చల్లారిన తర్వాత యూఎస్‌ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ ఈ అవినీతి వ్యవహారంపై దృష్టి సారించింది. విచారణ వేగం పుంజుకోవడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top