మనోళ్ల దీపావళి ఎఫెక్ట్‌: వెల్లువెత్తిన ఫిర్యాదులు | Diwali Celebrations Gone Wrong in the USA | Sakshi
Sakshi News home page

మనోళ్ల దీపావళి ఎఫెక్ట్‌: వెల్లువెత్తిన ఫిర్యాదులు

Oct 25 2025 9:16 AM | Updated on Oct 25 2025 10:33 AM

Diwali Celebrations Gone Wrong in the USA

భారత్‌తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. 

దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్‌ ఉదాహరణంగా నిలిచింది!.

న్యూయార్క్‌ నగరం క్వీన్స్‌ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్‌ స్ట్రీట్‌లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్‌వర్క్స్‌ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. 

న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్‌ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్‌  అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. 

దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్‌ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్‌ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. 

అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement