ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన ధర | - | Sakshi
Sakshi News home page

ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన ధర

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

మోర్తాడ్‌(బాల్కొండ): పంట ఒక్కటే కాని ధర మాత్రం వేరు వేరుగా నిర్ణయించారు. సజ్జ పంట సాగు చేసిన రైతులకు మార్కెట్‌లో భిన్నమైన రేట్లు లభిస్తున్నాయి. ఈ పంట సాగు చేసిన మోర్తాడ్‌తో పాటు కొన్ని గ్రామాల రైతులకు క్వింటాలుకు రూ.4,200 ధర లభిస్తే, తిమ్మాపూర్‌, శెట్‌పల్లి, ఏర్గట్ల, బాల్కొండ, వేల్పూర్‌, మెండోరా, ముప్కాల్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులకు రూ.4,500 ధర దక్కుతోంది. సజ్జల కొనుగోలు విషయంలో సీడ్‌ వ్యాపారుల మాటనే నెగ్గుతుండటంతో రైతులు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. యాసంగి సీజను కు సాగు చేసిన సజ్జలకు ధర లేకుండా పోయింది. బైబ్యాక్‌ ఒప్పంద సమయంలోనే విత్తన వ్యాపారులు తక్కువ ధరకే రైతులతో అంగీకారం కుదుర్చుకున్నారు. ఫలితంగా మార్కెట్‌లో ఈ పంటకు డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు చెప్పిన ధరకే పంటను విక్రయించి లాభాలను పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. సజ్జలకు గతంలో రూ.6,500 ధర ఉండగా ఇప్పుడు రూ.4,500లకు కుదించారు. దిగుబడి పెరగకపోవడం, ధర తగ్గిపోవడంతో తమ శ్రమ వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నే ళ్ల క్రితం బాల్కొండ, ఆర్మూర్‌, నియోజకవర్గాలతో పాటు రూరల్‌ నియోజకవర్గంలోని ఒకటి రెండు మండలాల్లోనే సజ్జను సాగు చేసేవారు. పసుపు తవ్వకాలు పూర్తి కాగానే సజ్జల సాగును ఆరంభించేవారు. దాదాపు 25వేల ఎకరాల్లో సాగు చేసిన సజ్జ పంటను రైతులు తగ్గించారు. ధర లేకపోవడం, ది గుబడిలో వృద్ధి కనిపించకపోవడంతో ఇప్పుడు 10 వేల ఎకరాలకే పంట పరిమితమైంది. పంట సాగు విస్తీర్ణం తగ్గినా ధర పె రగకపోవడంపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తన వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు సజ్జకు ప్రత్యామ్నాయంగా నువ్వుల పంటను సాగు చేశారు.

బస్తాలలో నింపిన సజ్జలు

సజ్జ పంటకు భిన్నమైన రేట్లు

బైబ్యాక్‌ ఒప్పందంలోనే రైతులకు

ధర తగ్గించిన వ్యాపారులు

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా విత్తన వ్యాపారులు చెప్పిన ధరకే

విక్రయిస్తున్నామని రైతుల వేదన

గతంలో క్వింటాలుకు రూ.6,500

ఉండగా.. ఇప్పుడు రూ.4,500లకు మించని ధర

Advertisement
 
Advertisement
Advertisement