ఇందూరు వంటింట
ఈ యేడు ఎండు మిర్చి ధరలు గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. జిల్లాలో కారం పొడి మిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.160 నుంచి రూ. 350 వరకు ఉంది. బ్రాండెడ్ ప్యాకెట్లు రూ.200 నుంచి రూ. 380 వరకు అమ్ముతున్నారు. వినియోగదారులు, వ్యాపారులూ ధరల మంటతో సతమతమవుతున్నారు. జిల్లా వాసుల అవసరాల్లో 80 శాతానికి పైగా మహారాష్ట్రలోని ధర్మాబాద్, బీదర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటారు. విరివిగా కారం గిర్నీలను ఏర్పాటు చేశారు.
ఆర్మూర్: ఇందూర్ జిల్లా ప్రజల వంటింట్లో కారం ఘాటు పెరిగింది. పచ్చళ్లు, కూరలకు ప్రాణం పోసే కారం సామాన్యుడికి మంట పుట్టిస్తోంది. అందుకు కారణం ఎండు మిర్చి ధరలు గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరగడమే. అయితే ఇక్కడి వాళ్లకు మిర్చి ఘాటు కొత్త కాదు, సరిహద్దు దాటి మహారాష్ట్రతో పాటు వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చే మిర్చి ఘాటు కూడా కొత్త కాదు. నిజామాబాద్ నగర జనాభా సుమారు 3,11,152. జిల్లా జనాభా 25,52,073. సగటున ఒక కుటుంబం నెలకు 250 గ్రా. నుంచి 500 గ్రా. ఎండు మిర్చి వాడుతుంది. జిల్లాలో సుమారు 5 లక్షల కుటుంబాలు ఉంటే, నెలకు 125 టన్నుల నుంచి 250 టన్నుల ఎండు మిర్చి అవసరం అవుతుంది. జిల్లాలో మిర్చి పంట విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో జిల్లా వాసుల అవసరాల్లో 80 శాతానికి పైగా మహారాష్ట్రలోని ధర్మాబాద్, బీదర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో జిల్లాలోని ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లోని గ్రామాల్లో వ్యాపారస్తులు విరివిగా కారం గిర్నీలను ఏర్పాటు చేసి ఎండు మిర్చిని దిగుమతి చేసుకొని స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొందరు జిల్లా వాసులు మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లాకు సరిహద్దు కావడంతో చవకగా ఉన్న రైలు ప్రయాణం చేసి నేరుగా ఎండు మిర్చి కొనుగోలు చేసి అక్కడే కారం పట్టించుకుంటున్నారు. 2024లో క్వింటా మిర్చి ధర రూ.12 వేలు పలికింది. 2025లో క్వింటాలు ఎండు మిర్చి రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలికింది. దీంతో మిర్చి పండించిన అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది పరిస్థితి తారుమారైంది. లావు మిర్చి రకం క్వింటా రూ.22 వేల నుంచి రూ.25 వేలు, సన్న రకం రూ.21 వేల నుంచి రూ.22 వేలు ధర పలుకుతోంది. దీంతో కారం రిటేయిల్ అమ్మకా ల ధరలు సైతం గణనీయంగా పెరిగిపోయాయి. వరంగల్ జిల్లా చిల్లీ పౌడర్ తయారీకి కేంద్రంగా ఉంది. ఇక్కడి వ్యాపారులు వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం నుంచి ఎండు మిర్చి తెప్పించి పొడి చేసి హోల్‌సేల్, రిటైల్‌గా అమ్ముతున్నారు. జిల్లాలో కారం పొడి మిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.160 నుంచి రూ. 350 వరకు ఉంది. బ్రాండెడ్ ప్యాకెట్లు రూ.200 నుంచి రూ. 380 వరకు అమ్మకా లు సాగిస్తున్నారు. వినియోగదారులు, వ్యాపారులు ఇద్దరూ ధరల మంటతో సతమతమవుతున్నారు. దిగుబడి పెరిగితేనే ధరలు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతేడాదితో పోల్చితే మూడు రెట్లు
పెరిగిన ధరలు
మహారాష్ట్ర, వరంగల్ నుంచి
ఎండు మిర్చి దిగుమతి
ప్యాకెట్లలో అమ్మే కారం నాణ్యతపై
అనుమానాలు
మిర్చీ కొనుగోలుచేసి గిర్నీలో
పట్టించుకుంటున్న గృహిణులు


