● రెడ్‌కో సంస్థ ఆధ్వర్యంలో
2 మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను తెలంగాణ రెడ్‌కో ప్యానల్ బోర్డు జనరల్ మేనేజర్ వెంకటరమణ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటి సోలార్ ప్లాంట్‌ను జక్రాన్‌పల్లి ఉపకేంద్రం వద్ద ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కలిగోట్ సబ్‌స్టేషన్ పరిధిలో మరో ప్రాజెక్టును ప్రారంభించారు. మనోహరాబాద్ రెవిన్యూ శివారులో పడకల్‌కు చెందిన రైతు మగ్గిడి సుదర్శన్‌రెడ్డి తనకున్న ఆరెకరాల భూమిలో పీఎం కుసుమ్ ప్రాజెక్టులో భాగంగా రెడ్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను రెడ్ కో జీఎం వెంకటరమణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు నిజామాబాద్ సహకారంతో రూ. 7 కోట్ల వ్యయంతో సుదర్శన్‌రెడ్డి ప్లాంట్ ఏర్పాటు చేయడం మిగితా రైతులకు ఆదర్శనీయమని అన్నారు. 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లించేందుకు ఎన్‌పీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఒక్కసారి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ముప్పై ఏళ్ల వరకు మంచి ఆదాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు సర్కిల్ హెడ్ సుజిత్‌కుమార్ ఝా, మాజీ జడ్పీటీసీ సభ్యులు తనుజా శ్రీనివాస్‌రెడ్డి, పడకల్ సర్పంచ్ లోక స్వప్న, పురుషోత్తంరెడ్డి, మౌల్యా ప్రాజెక్టు ఇంజనీర్ శివప్రసాద్, దయాకర్‌రెడ్డి, సిద్ధార్థ గంగారెడ్డి, చిన్నారెడ్డి, విజయ్‌రెడ్డి, వకీల్ గంగారెడ్డి పాల్గొన్నారు.


