ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ దొంగల ముఠా అరెస్ట్‌

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

64 కేసులలో ఏడుగురు నిందితులు

వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్‌అర్బన్‌: అంతర్‌ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెంజల్‌ మండలం సాటాపూర్‌ బైపాస్‌ వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు మూడు మోటార్‌ సైకిళ్లపై అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఉన్న గన్ని బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ లభించాయన్నారు. విచారించగా కాపర్‌ కాయిల్స్‌ దొంగిలిస్తున్నట్లు వెల్లడించారన్నారు. 64 ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి కాపర్‌ కాయిల్స్‌ దొంగిలించారు. నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌, బోధన్‌ రూరల్‌, బోధన్‌ టౌన్‌, వర్ని, కోటగిరి, నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌, డిచ్‌పల్లి ఇందల్‌వాయి ప్రాంతాల్లో 38 ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ కాయిల్స్‌ అపహరించారన్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్‌, భిక్కనూర్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ ఏరియాలలో 20 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. మెదక్‌ జిల్లాలోని మెదక్‌ రూరల్‌, చేగుంట, వెల్దుర్తి, ఏరియాలలో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లలోని కాయిల్స్‌ చోరీ చేసినట్లు పేర్కొన్నారు. బోధన్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌కు చెందిన నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను మెదక్‌ టౌన్‌కు చెందిన వనం సాయిలు, సారయ్య, బోధన్‌కు చెందిన వనం పోశెట్టి, మెదక్‌కు చెందిన ధన కిరణ్‌, దాసరి పోచయ్యగా గుర్తించామన్నారు. దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన బోధన్‌లోని రాకాసి పేటకు చెందిన సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌, గూపన్‌పల్లికి చెందిన షేక్‌ మహబూబ్‌, మేడ్చల్‌ జిల్లా కలకలి గ్రామానికి చెందిన మాలప్ప మాస్టర్‌, మేడ్చల్‌ జిల్లాకు చెందిన తాయప్ప దంగల్‌ను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్‌, మూడు మోటార్‌ సైకిళ్లు, 4 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. సమావేశంలో బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయినాథ్‌, చంద్రమోహన్‌, రెంజల్‌ ఎస్సై మచ్చందర్‌ రెడ్డి, బోధన్‌ రూరల్‌ ఎస్సై విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement