ఉపాధికి వడదెబ్బ ముప్పు! | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి వడదెబ్బ ముప్పు!

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): నిప్పులు కక్కుతున్న ఎండలు సామాన్యులను వణికిస్తుండగా, ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూలీలకు వడదెబ్బ ము ప్పు పొంచి ఉంది. ఉదయం పనికి వచ్చిన కొద్ది సేపటికే భానుడు మండిపోతుండడంతో పని ప్ర దేశాల్లో కూలీలు అల్లాడుతున్నారు. తొమ్మిది గంటలకు వాతావరణం వేడెక్కి వడగాలులు వీస్తున్నాయి. దీంతో కూలీలు ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అలసటతో పని చేయలేకపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, ప్ర జాప్రతినిధులు కూలీలకు ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకె ట్లు అందజేయడంతో కొంత వరకు ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు జరుగుతుండగా, ప్రస్తుతం 35వేల మందికి పైగా కూలీలు పనులను వస్తున్నారు. వేసవి కావడంతో నీళ్లు తగ్గిన చెరువులు, కుంటల్లో కూలీలతో మట్టి పూడిక తీయిస్తున్నారు. నల్ల రేగడి, ఎరుపు నేలలు కావడంతో భానుడి ప్రతాపానికి వాతావరణం తొందరగా వేడెక్కుతోంది.

డొంకేశ్వర్‌ మండలం దత్తాపూర్‌ పెద్ద చెరువులో పూడిక తీస్తున్న ఉపాధి కూలీలు

కొన్ని చోట్ల చిన్నపాటి టెంట్లు

ఎండలు తీవ్రం కావడంతో పని ప్రదేశాల్లో పని చేసి అలసిపోయిన కూలీల కోసం నీడనిచ్చే టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఫీల్ట్‌ అసిస్టెంట్లను, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా నే ఉన్నాయి.

కానీ, మరికొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి షేడ్‌ నెట్లు ఏర్పాటు చేశారు. వాటి కింద పదిమంది మాత్రమే కూర్చోగలుగుతున్నారు. మిగతా కూలీలు చెట్ల నీడకు సేద తీరుతున్నారు. తాగునీరు కూడా కొన్ని చోట్ల దూర ప్రాంతాలకు రవాణా చేయలేకపోతున్నారు.

సౌకర్యాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చాం

తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకుని కూలీలు పని చేసే చోట వారు సేద తీరేందుకు టెంట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే శాఖాపరమైన చర్యలుంటాయి. కూలీలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రవాన్ని తాగాలి. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్‌

ఉదయం 8గంటలకే

భగభగ మంటున్న భానుడు

వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

పని ప్రదేశాల్లో తగినంత నీడ,

నీళ్లు లేక ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement