జక్రాన్‌పల్లి: రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి రెడ్డి అన్నారు. అదిలాబాద్ జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ గదిలో మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కెవికె కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్, ఫిసికల్చర్ వెటర్నరీ సహా అన్ని రంగాల రైతులకు శాస్త్రవేత్తలు సరైన సలహా సూచనలు ఇవ్వాలన్నారు. పంటను ప్రభుత్వమే మార్కెటింగ్ చేయించి పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల రైతు ఉత్పత్తిదారు సంఘాల ప్రతినిదులు, రైతులు, కెవికె శాస్త్రవేత్త శ్వేత, రాజు తదితరులు పాల్గొన్నారు.


