సెలవుల్లో సెట్‌ చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో సెట్‌ చేద్దాం

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

ఎన్నో అవకాశాలు.. చదువుతోపాటు ఆరోగ్యం..

వచ్చే నెలలో జరుగనున్న

కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌

విద్యార్థులు సన్నద్ధమైతే

ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం

ఖలీల్‌వాడి: జిల్లాలో పది, ఇంటర్‌ విద్యార్థులందరూ వార్షిక పరీక్షలు ముగియడంతో సెలవుల్లో సరదాగా గడుపుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్స్‌, సినిమాలతో ఎంజాయ్‌ చేస్తూ గడిపేస్తుంటారు. ఇలా సెలవులను వృథా చే యకుండా ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ కోసం సన్నద్ధమవుతే ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. దీంతో ఉత్తమ కాలేజీల్లో సీటు పొందడంతోపాటు ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు.

ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడగా పది పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల తర్వాత పదవ తరగతి విద్యార్థులు పాలిటెక్నిక్‌, ఐఐఐటీ, ఇంటర్మీడియట్‌ గురుకులాల్లో (టీఎస్‌ఆర్‌జేసీ) ద్వారా ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి, ఉత్తమ ర్యాంకులు సాధిస్తే సీటు లభించే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు గురుకులం, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్‌’తోపాటు ఎప్‌ట్‌, నీట్‌, డీసెట్‌తో వివిధ కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిగ్రీలో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పీజీఈ సెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌, ఈ సెట్‌ లాంటి ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ రాసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు జాతీయస్థాయిలోనూ పలు కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ కూడా ఉంటాయి.

విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవుల్లో చదవడమే కాకుండా ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి మానసిక సన్నద్ధత, ఆత్మవిశ్వాసం కీలకం. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేలా యోగా, ధ్యానం వంటి సాధనాలు ఉపయోగపడతాయి. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సెలవులను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement