డొంకేశ్వర్(ఆర్మూర్): ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ కలిసి ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ అలాగే ‘అగ్రికల్చర్ వీక్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలో సోమవారం నుంచి మే 23వ తేదీ వరకు రైతులకు వివిధ అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని మొత్తం 64 గ్రామాల్లో నిర్వహించనుండగా, అగ్రికల్చర్ వీక్‌ను అన్ని రైతు వేదికలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుపనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులకు పంటల సాగులో పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా అధిక యూరియా వాడకం కారణంగా కలిగే నష్టాలు, నేల ఆరోగ్యం, రసాయనాల వాడకం, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలు, సేంద్రియ సాగు అంశాలను వివరిస్తారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయడం, అధిక దిగుబడులు వచ్చే వంగడాలు, ఆధునిక వ్యవసాయం, ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియజేస్తారు. ఉద్యాన, సహకార, పశుసంవర్ధక, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నాయి.
నేటి నుంచి మే 23 వరకు జిల్లాలో కార్యక్రమం
యూరియా వాడకం, పంట మార్పిడి.. తదితర అంశాలపై అవగాహన
అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహణ
ఎనిమిది బృందాల శాస్త్రవేత్తలు..
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడానికి మొత్తం ఎనిమిది బృందాల శాస్త్రవేత్తలను నియమించాం. వ్యవసాయ శాఖ సహకారంతో రైతులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించి సాగులో అంశాలను, కొత్త పద్ధతులను వివరిస్తాం. దాదాపు నెల రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయి.
– ఇందుధర్‌రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే, రుద్రూర్
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. మే 4 నుంచి 9వ తేదీ వరకు అగ్రికల్చర్ వీక్ కూడా ఉంది. కార్యక్రమాలకు రైతులను ఆహ్వానించి విజయవంతంగా నిర్వహించాలని ఏఈవో, ఏవోలకు ఆదేశాలు జారీ చేశాం.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి


