ఉద్యాన శాఖకు స్పైస్‌పార్క్‌! | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన శాఖకు స్పైస్‌పార్క్‌!

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

ఎనిమిదేళ్ల తర్వాత కొనసాగుతున్న

అభివృద్ధి పనులు

రూ.2.75 కోట్లతో సీసీ ప్లాట్‌ఫాంలు, టాయ్‌లెట్‌ల నిర్మాణం

మోర్తాడ్‌(బాల్కొండ): పసుపు క్రయ, విక్రయాల కోసం వేల్పూర్‌ క్రాస్‌రోడ్‌ వద్ద కేటాయించిన స్థలంలో స్పైస్‌పార్క్‌ పనులు మళ్లీ మొదలయ్యాయి. స్పైస్‌పార్క్‌ ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అయితే, పనుల అనంతరం దీనిని ఉద్యాన శాఖకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాల భూమిని స్పైస్‌పార్క్‌ కోసం కేటాయించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీయస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అప్పట్లో భూ సేకరణ, ప్రహరీ, సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు సైతం విడుదల చేశారు. అయితే, సిమెంట్‌ ప్లాట్‌ఫాంలు, గోదాంలు, షెడ్‌లు, విశ్రాంతి గదులు, టాయ్‌లెట్స్‌ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.75 కోట్లు మంజూరు కావడంతో సీసీ ప్లాట్‌ఫాంలు, టాయ్‌లెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఇతర పనుల కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత పనులతోనైనా స్పైస్‌పార్క్‌ వినియోగంలోకి వస్తే వచ్చే సీజన్‌లోనైనా స్థానికంగానే పసుపు క్రయ విక్రయాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తేనే స్పైస్‌పార్క్‌ వినియోగంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వేల్పూర్‌ శివారులోని స్పైస్‌పార్క్‌

సకాలంలో పూర్తి చేస్తాం

స్పైస్‌పార్క్‌కు కేటాయించిన రూ.2.75 కోట్ల నిధులతో సకాలంలో పనులు పూర్తి చేస్తాం. పనులు పూర్తికాగానే ఉద్యాన శాఖకు అప్పగిస్తాం. మా సంస్థ ఆధ్వర్యంలో అన్నిరకాల అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది. నిధులు విడుదల కావడంతో పనులు సాగుతున్నాయి. – శివ, జేఈ, టీఎస్‌ఐఐసీ

Advertisement
 
Advertisement
Advertisement