● కుక్కకాటు, పాముకాటు మందులు
పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాలి
● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్
బీ రవీంద్రనాయక్
సుభాష్‌నగర్: వైద్య ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బీ రవీంద్రనాయక్ సూచించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో చాంబర్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, క్షయ, లెప్రసీ నియంత్రణ, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్, జీవనశైలి వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాయక్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తే ప్రజల నుంచి గౌరవం లభిస్తుందన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు, పాముకాటు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పీహెచ్‌సీ అవసరాలకు అనుగుణంగా మందులను ఫార్మసిస్టులు ఈ–ఔషధిలో నమోదు చేయాలని, దీంతో మందులు సరఫరా అవుతాయన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జీజీహెచ్‌లకు పేషెంట్లను రిఫర్ చేసినప్పుడే అన్నిస్థాయిలో వైద్య సేవలు సంపూర్తిగా అందించినట్లు అవుతుందని తెలిపారు. డివిజన్ల వారీగా ఆరోగ్య కేంద్రాల జనాభా ఆధారంగా నూతన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మానవ వనరులు, బిల్డింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరమ్మతుల వివరాలు, తదితర అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీటీసీవో దేవీనాగేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, డాక్టర్లు సమత, సికిందర్ నాయక్, ఏవో సుమంత్‌కుమార్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, రాకేశ్, వెంకటేష్, సుప్రియ, శిఖరా, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


